వెయ్యి టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం : జిసిసి ఎం.డి. జి. సురేష్ కుమార్

 



అల్లూరి జిల్లాలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వెయ్యి టన్నుల కాఫీ గింజలు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేశ్‌కుమార్‌ IIS తెలిపారు. ఇటీవల జీకేవీధి మండలంలోని శివారు పెదవలస, ఎర్రచెరువులు, మాడెం గ్రామాలతో పాటు చింతపల్లి మండలంలోని చిక్కుడుబట్టి, కిటుముల, బౌడ గ్రామాలను సందర్శించారు. ఆదివాసీ కాఫీ రైతులతో స్వయంగా మాట్లాడి కాఫీ గింజల కొనుగోలు, ధరలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ రైతులకు అపెక్స్‌ కమిటీ సిఫారసు చేసిన అంతర్జాతీయ ధరలను జీసీసీ అందిస్తున్నదన్నారు. కిలో పార్చిమెంట్‌ రూ.280, చెర్రీ రూ.145, రొబస్ట్రా రూ.70 ధరలకు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రైవేటు వర్తకులు జీసీసీ కంటే రూ.30-40 తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను జీసీసీకి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పాడేరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో ఇప్పటికే 200 టన్నుల పార్చిమెంట్‌ కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం చెర్రీ సీజన్‌ ప్రారంభమైందన్నారు. గత ఏడాది జిల్లాలో వెయ్యి టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది అదే లక్ష్యంతో కొనుగోలు ప్రారంభించామని, అయితే ఈ ఏడాది ఆశించిన దిగుబడులు రైతులకు రాలేదని చెప్పారు. జీసీసీకి కాఫీ గింజలను విక్రయించిన రైతులకు వెంటనే నగదు వారి వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాకు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.ఐదు కోట్ల నగదు రైతులకు చెల్లించామన్నారు. ఆదివాసీ రైతులు కాఫీ గింజలను జీసీసీ ద్వారా మార్కెటింగ్‌ చేసుకుని మంచి ధర పొందాలని, దళారీలను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు.
వచ్చే ఏడాది అరకు బ్రాండ్‌పై ఇన్‌స్టంట్‌ కాఫీ
వచ్చే ఏడాది అరకు బ్రాండ్‌పై గిరిజన సహకార సంస్థ ఉత్పత్తి చేసిన ఇన్‌స్టంట్‌ కాఫీ పొడిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. ఏపీలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.ఐదు కోట్ల జీసీసీ నిధులతో కొయ్యూరు మండలం డౌనూరు వద్ద ఇంటిగ్రేటెడ్‌ కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం సివిల్‌ వర్కు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాదికి ఈ యూనిట్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ యూనిట్‌ వద్దనే క్యూరింగ్‌, హల్లింగ్‌, పౌడర్‌, ప్యాగింగ్‌ చేసే అత్యాధునిక యంత్ర సామగ్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యూనిట్‌ అందుబాటులోకి వస్తే ఆదివాసీ కాఫీ ఉత్పత్తులకు ధర మరింతగా పెరుగుతుందన్నారు.

Comments

Popular posts from this blog

అరకువ్యాలీ కాఫీ, జిసిసి కృషిని ప్రశంసించిన ప్రధాని మోది జి.. అరకు కాఫీ రుచిని ఆస్వాదించమని మన్ కి బాత్ శ్రోతలను కోరిన ప్రధాని

🌿 Embrace the goodness of Turmeric from the heartlands of Andhra Pradesh! 🌿